Peddapalli: తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా!
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీవో ఆఫీసులో తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా.. ఇన్చార్జ్ ఎంపీడీవో దివ్య సుదర్శన్ రావు నిర్లక్ష్యంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.
Peddapalli: తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా!
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం వేదికగా ఓ ఘోర తప్పిదం చోటుచేసుకుంది. జాతీయ జెండాను గౌరవించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇన్చార్జ్ ఎంపీడీవో దివ్య సుదర్శన్ రావు ఆధ్వర్యంలో జెండా ఎగరేసేందుకు ఏర్పాట్లు చేశారు.అయితే, మొదట జెండా ఎగరేసే సమయంలో తాడు సరిగ్గా రాకపోవడంతో జెండా మొరాయించింది. దీంతో సిబ్బంది జెండాను కిందకు దించి సరిచేశారు.
కానీ, రెండోసారి పైకి ఎగరేసే సరికి.. అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జాతీయ జెండా కాషాయ రంగు కిందకు, ఆకుపచ్చ రంగు పైకి వచ్చేలా.. తలకిందులుగా ఎగిరింది.ఈ ఘోర తప్పిదాన్ని ఆలస్యంగా గమనించిన అధికారులు.. హుటాహుటిన జెండాను మళ్లీ కిందకు దించారు.
ఆ తర్వాత సరిచేసి మూడోసారి పైకి ఎగరవేశారు. కనీస పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే జాతీయ జెండాకు ఈ అవమానం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద వేడుకలో ఇలాంటి పొరపాటు జరగడంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.




