Sircilla: నేత్రదానం చేయండి.. మరో ఇద్దరికి చూపును ప్రసాదించండి

Sircilla: నేత్రదానంతో మరో ఇద్దరికి చూపుని ప్రసాదించవచ్చని, 41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ప్రజలకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ అంజేలా ఆల్ఫ్రెడ్ అవగాహన కల్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 29 Aug 2026 4:39 PM IST
Sircilla
X

Sircilla: నేత్రదానం చేయండి.. మరో ఇద్దరికి చూపును ప్రసాదించండి

సిరిసిల్ల: కంటి చూపు ఎంతో విలువైనదని, ఒకసారి చూపు కోల్పోతే తిరిగి పొందడం కష్టమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అంజేలా ఆల్ఫ్రెడ్ అన్నారు. కంటి ప్రమాదాలు, వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా రంగినేని ట్రస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ రగుడు, లగిశెట్టి శ్రీనివాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ తంగళ్లపల్లి, ప్రభుత్వ ఓల్డ్ ఏజ్ హోమ్ మండేపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో డీఎంహెచ్‌ఓ పాల్గొన్నారు.

భారతదేశంలో సుమారు 12 లక్షల మంది కార్నియా సంబంధిత అంధత్వంతో బాధపడుతున్నారని, వారిలో చిన్నారులు కూడా అధికంగా ఉన్నారని తెలిపారు. కార్నియా వల్ల కలిగే అంధత్వ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జిల్లాలో నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మరణించిన వ్యక్తి నేత్రాలను ఆరు గంటల్లోపు సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. కంటి అద్దాలు ధరించేవారు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు, కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా నేత్రదానం చేయవచ్చని స్పష్టం చేశారు.

ఇంట్లో లేదా బంధువుల్లో ఎవరైనా మరణిస్తే వెంటనే నేత్ర సేకరణ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. గదిలో ఫ్యాన్ ఆఫ్ చేసి, మృతుని కళ్లను మూసి, కనురెప్పలపై తడి గుడ్డ లేదా ఐస్ ముక్కలు ఉంచి, తల కింద దిండును పెట్టాలని తెలిపారు. నిపుణులు మృతుని వద్దకే వచ్చి 15 నుంచి 20 నిమిషాల్లో నేత్ర సేకరణ ప్రక్రియను పూర్తి చేస్తారని చెప్పారు. ఈ ప్రక్రియతో మృతదేహం రూపంలో ఎలాంటి వికృతం ఏర్పడదని పేర్కొన్నారు.

నేత్రదాత, నేత్ర గ్రహీత వివరాలను గోప్యంగా ఉంచుతామని, నేత్ర సేకరణ నుంచి కార్నియా అమర్చే వరకు ప్రక్రియను ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు.

“నేత్రదానం చేయండి.. మరో ఇద్దరికి చూపుని ప్రసాదించండి” అని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అంజేలా ఆల్ఫ్రెడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయీమ్ జహా, రాజేందర్, నిఖిల్, నాగరాజు, ఆప్టోమెట్రిస్టులు, ఓల్డ్ ఏజ్ హోమ్ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story