Sircilla: వ్యవసాయ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు
Sircilla: సిరిసిల్ల బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో "నషా ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమం. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు డిఎస్పీ నాగేంద్ర చారి పిలుపు.
Sircilla: వ్యవసాయ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు
సిరిసిల్ల: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని వక్తలు సూచించారు. సిరిసిల్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్ – వికసిత్ భారత్ కీ పెహచాన్” అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (DSP) నాగేంద్ర చారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) నాగేశ్వర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎస్. ఉపేందర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక, సామాజిక, విద్యాపరంగా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతాయని విద్యార్థులకు వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజంలో సానుకూల మార్పుకు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.
DSP నాగేంద్ర చారి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండటంతో పాటు మాదకద్రవ్యాల అనర్థాలపై ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
CI నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ వినియోగం, వ్యసనానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అసోసియేట్ డీన్ డా. ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన యువతే అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు “నో” చెప్పి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, కళాశాల సిబ్బంది మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో అవగాహన కల్పించాలని ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.




