Gangadhara: అక్రమ మట్టి తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్..
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల చెరువులో అక్రమ మట్టి తరలింపుపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు.
Gangadhara: అక్రమ మట్టి తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్..
గంగాధర: కురిక్యాల గ్రామ చెరువును మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాల చెరువులలో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అక్రమంగా మట్టి తరలింపు జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. చెరువులలో నుంచి మట్టిని తరలించేందుకు కొద్దిపాటి అనుమతులు మాత్రమే తీసుకుని, ఆ అనుమతులను అడ్డుగా పెట్టుకుని భారీ స్థాయిలో మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని విమర్శించారు.
అక్రమ మట్టి తరలింపుపై ఎవరైనా విలేకరులు, ప్రజాప్రతినిధులు లేదా పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఇదేమిటి” అని అడిగితే చంపేస్తామని కూడా బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ మట్టి దందా మరింత పెరిగిపోతుందని విమర్శించారు.
ఇలా చెరువుల నుంచి అక్రమంగా మట్టిని తరలించడం వల్ల చెరువు కట్టలు బలహీనపడే ప్రమాదం ఉందని, వర్షాకాలంలో చెరువులు తెగిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరించారు. అంతేకాకుండా చెరువుల్లో జీవించే చేపలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చెరువుల నుంచి జరుగుతున్న అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని చెరువులను పరిరక్షించాలని ఆయన కోరారు.




