Manthani: మంథనిలో రూ.164 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన
Manthani: మంథనిలో రూ. 164 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి. కళ్యాణలక్ష్మి, రేషన్ కార్డుల పంపిణీ.
Manthani: మంథనిలో రూ.164 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన
మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలో సుమారు 164 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. గంగపురిలో 20 కోట్లతో న్యాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బస్ డిపో నుంచి గోదావరినది వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 22 కోట్ల నిధులు, సూరయ్యపల్లి నుండి కాకర్లపల్లి వరకు 29 కోట్ల నిధులు, గుంజపడుగు నుండి విలోచవరం వరకు 8 కోట్లు, కూనారం నుండి ముత్తారం వరకు 36 కోట్లు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు,
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు పలు గ్రామాలకు వైకుంఠ రథాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.... మంథని అభివృద్ధికి రూ.164 కోట్లు కాదు.. రూ.800 కోట్ల నిధులు ఇచ్చిన తక్కువేనని అన్నారు. మంథని ప్రాంతానికి చేసిన సేవలకు ఈ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాకుండా రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పుకుంటామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. శ్రీధర్‌బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావుతో కలిసి పనిచేసిన అదృష్టం తమకు దక్కిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నిరుపేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తుమ్మల తెలిపారు. మంథని నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి శ్రీధర్‌బాబును నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఎప్పటికీ మర్చిపోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...
మంథనిలో నేడు 164 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, మంథని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మంథని గోదావరినదిపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు.ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
తదనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ...మంథని నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉందని దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును, మాజీ స్పీకర్ శ్రీపాద రావును గుర్తు చేశారు.మంథని నియోజకవర్గానికి ఆర్ అండ్ బి నుండి దాదాపు 800 కోట్ల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు.20కోట్లతో మంథని లో న్యాక్ సెంటర్ మంజూరు చేశామని త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు.




