Manthani: అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్.. ఈ నెల 24న ప్రారంభించనున్న మంత్రి!
Manthani: 40,052 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఈ నెల 24న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు.
Manthani: అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్.. ఈ నెల 24న ప్రారంభించనున్న మంత్రి!
మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఈ నెల 24న సోమవారం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు–వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మంథని మార్కెట్ యార్డులో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 8,000 చదరపు అడుగుల షెడ్‌లో ఈ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని 5 మండలాల్లో మొత్తం 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 40,052 మంది విద్యార్థులకు ఈ కిచెన్ ద్వారా నాణ్యమైన అల్పాహారం అందించనున్నారు.
కిచెన్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆటోమేటెడ్ వంట యంత్రాలను ఏర్పాటు చేశారు. గంటకు 5,400 ఇడ్లీలు, 2,000 దోశలు, 3,000 పూరీలు తయారు చేసే సామర్థ్యం కలిగిన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. రెండు గంటల్లో 5,000 మంది విద్యార్థులకు సరిపడా సాంబార్, కూరలు సిద్ధం చేసే సదుపాయం ఉండగా, 15 నిమిషాల్లో 1,000 మందికి సరిపడా అన్నం తయారు చేయగల రైస్ కుకింగ్ పరికరాలను ఏర్పాటు చేశారు.
అలాగే ఆటోమేటిక్ వెజిటబుల్ వాషింగ్, కటింగ్ యూనిట్లు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ (ETP), వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసే వ్యవస్థతో పాటు ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతను పర్యవేక్షించే ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
ఎన్‌ఐఎన్ సూచనలతో మెనూ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు విద్యార్థులకు వారాంతపు మెనూను రూపొందించారు. సోమవారం ఇడ్లీ–సాంబార్, మంగళవారం పూరీ–ఆలూ కుర్మా, బుధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శుక్రవారం చిరుధాన్యాల ఇడ్లీ–సాంబార్, శనివారం బోండా–చట్నీ అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి HKMCF అధ్యక్షుడు, అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రీజినల్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్ర దాస స్వామీజీ తదితరులు హాజరుకానున్నారు.
కిచెన్ నిర్మాణానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు ఈ కిచెన్ కీలకంగా ఉపయోగపడనుంది.




