Jagtial: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్
Jagtial: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Jagtial
Jagtial: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో జరుగుతున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల కారణంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగుతుండగా, భారీ సంఖ్యలో భక్తులు అంజన్న సేవలో పాల్గొన్నారు.
మంత్రివర్యులు ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.




