Karimnagar: బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతున్న మినీ చెక్ డ్యామ్ మత్తడి!
Karimnagar: కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో రూ.3.5 లక్షలతో చేపట్టిన మినీ చెక్ డ్యామ్ మత్తడి ఆధునికీకరణ పనులను మేయర్ కొలగాని శ్రీనివాస్ పరిశీలించారు.
Karimnagar: బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతున్న మినీ చెక్ డ్యామ్ మత్తడి!
కరీంనగర్: నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో రూ.3.5 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపడుతున్న మినీ చెక్ డ్యామ్ మత్తడి ఆధునికీకరణ పనులను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పరిశీలించారు.
ఇదివరకు మినీ చెక్ డ్యామ్ మత్తడికి లీకేజీలు ఉండడంతో నీరు నిల్వ ఉండకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక కార్పొరేటర్ బండ రమణారెడ్డి మేయర్ కొలగాని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించిన మేయర్, ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.3.5 లక్షలు కేటాయించి మత్తడి మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మత్తడి ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత మినీ చెక్ డ్యామ్‌లో నీరు నిల్వ ఉండేలా చేయడంతో పాటు వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. దీనివల్ల చైతన్యపురి మరియు పరిసర కాలనీల్లో భూగర్భ జలమట్టం పెరగడానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా నాలుగు నుంచి ఐదు డివిజన్లకు చెందిన మహిళలు, ప్రజలు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు ఈ ప్రాంతం అందుబాటులోకి వస్తుందని మేయర్ తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పండుగ వేడుకలకు అనువైన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
మత్తడి ఆధునికీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా బతుకమ్మ పండుగకు ముందే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు. నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
స్థానిక ప్రజల సమస్యలను గుర్తించి, కార్పొరేటర్ల సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని మేయర్ పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండ రమణారెడ్డితో పాటు కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, మాసం గణేష్, గాదె శివరావు, కర్రి అనిల్, ఎన్నం ప్రకాష్, అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.




