Manthani: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మంథని గురుకుల విద్యార్థులు!

Manthani: మంథని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ శ్రీనాథ్ అభినందనలు.

SHANKAR, MANTHANI
Updated on: 25 Aug 2026 12:39 PM IST
Manthani
X

Manthani: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మంథని గురుకుల విద్యార్థులు!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల–కళాశాల (బాలుర) కు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై ప్రతిభ చాటారు. ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

200 మీటర్ల పరుగు పందెంలో పదో తరగతి విద్యార్థి నవదీప్ ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. అలాగే బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో ఎనిమిదో తరగతి విద్యార్థి వివేక్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి, పాఠశాల ప్రిన్సిపల్ ఊటూరి శ్రీనాథ్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ రమేష్, పీఈటీ పుష్పలతలను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రిన్సిపల్ శ్రీనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ నవీన్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ రాజ్‌కుమార్, పాఠశాల, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story