Korutla: విద్యుత్ ప్రీపెయిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
Korutla: విద్యుత్ వినియోగానికి ప్రీపెయిడ్ విధానాన్ని తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోరుట్ల బస్టాండ్ వద్ద టీఆర్‌ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు.
Korutla: విద్యుత్ ప్రీపెయిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
కోరుట్ల: విద్యుత్ వినియోగానికి ప్రీపెయిడ్ విధానాన్ని తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. రఘు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నేతలు గురువారం కోరుట్ల బస్టాండ్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. రఘు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని అయితే విద్యుత్ వినియోగానికి ముందుగానే డబ్బులు చెల్లించే ప్రీపెయిడ్ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మొబైల్ ఫోన్‌కు రీఛార్జ్ చేసుకుంటేనే సేవలు అందుబాటులోకి వచ్చినట్లుగా విద్యుత్‌కు కూడా ముందుగా రీఛార్జ్ చేసుకుంటేనే సరఫరా జరిగే విధానం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా పేద గ్రామీణ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డా. రఘు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ముందస్తు రీఛార్జ్ విధానం గురించి అవగాహన లేకపోవడంతో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విధానాన్ని ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయని ఆయన గుర్తుచేశారు.
స్మార్ట్ మీటర్లకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం స్పష్టంగా వ్రాతపూర్వకంగా ప్రజలకు అందించాలని డా. రఘు డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రతిపాదిస్తున్న పంచాజన్య సంకల్పం లోని ఉచిత విద్య ఉచిత వైద్యం యువతకు ఉపాధి రైతు భరోసా సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజలకు అందించాలని కోరారు.
ప్రీపెయిడ్ విద్యుత్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చేసిన నినాదాలతో ధర్నా ప్రాంగణం మార్మోగింది.




