Kalwa Srirampur: జగదాంబ వాగు ఉధృతి.. కూనారానికి నిలిచిన రాకపోకలు
Kalwa Srirampur: కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో పొంగిపొర్లుతున్న జగదాంబ వాగు. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు, హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయాలని వినతి.
Kalwa Srirampur: జగదాంబ వాగు ఉధృతి.. కూనారానికి నిలిచిన రాకపోకలు
కాల్వ శ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలోని జగదాంబ దేవాలయం సమీపంలో గల వాగు (ఓర్రె) ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాగు పొంగిపొర్లుతోంది. నీటి ప్రవాహం తీవ్ర రూపం దాల్చడంతో కూనారం గ్రామానికి ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రయాణికులు, నిత్యం రాకపోకలు సాగించే గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రతి వర్షాకాలంలో జగదాంబ వాగు పొంగడం వల్ల కూనారం గ్రామం దిగ్బంధంలో చిక్కుకుంటోందని, అత్యవసర వైద్య సేవలకు కూడా వెళ్లలేని పరిస్థితి దాపురిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయాలి:
ఈ తీవ్ర సమస్యపై స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఎదురవుతున్న రవాణా అడ్డంకులకు శాశ్వత పరిష్కారంగా హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేలా కృషి చేయాలని కూనారం మాజీ సర్పంచ్ డొంకిన విజయ మొగిలి, మాజీ ఎంపీటీసీ కొల్లూరి రామ రాయమల్లు మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు.




