Vemulawada: రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ ప్రారంభం!
Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించిన కోడెలను సన్న, చిన్నకారు రైతులకు ప్రసాదంగా పంపిణీ. హాజరైన విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Vemulawada: రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ ప్రారంభం!
Vemulawada: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెలను సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. వేములవాడ తిప్పాపూర్ గోశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు కోడెలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోరిన కోరికలు తీర్చే తండ్రిగా భక్తుల విశ్వాసాన్ని పొందిన రాజన్నకు కోడె మొక్కు చెల్లించడం విశిష్టమైన సంప్రదాయమన్నారు. గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు అందించే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులకు కోడెలను అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మరింత పద్ధతిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రైతులు రాజన్న ప్రసాదంగా భావించి కోడెలను తమ బిడ్డల మాదిరిగా సంరక్షించాలని కోరారు. కోడెల సంరక్షణపై దేవాదాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. కోడెలను అక్రమంగా తరలించడం లేదా ఇతర మార్గాల్లో వినియోగిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాలు మరవని చిన్న కోడెలను సమర్పించవద్దు
భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి పాలు మరవని చిన్న కోడెలను సమర్పించవద్దని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. చిన్న కోడెలను దూర ప్రాంతాల నుంచి తరలించడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. జెర్సీ జాతి కోడెలను కూడా సమర్పించవద్దని సూచించారు. ఎదిగిన, ఆరోగ్యంగా ఉన్న దేశీ కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలని కోరారు.
కోడెలకు నాణ్యమైన దాణా, వైద్య సేవలు
కోడెలకు ఆరోగ్య సమస్యలు రాకుండా టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన పోషకాహారం, దాణా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న అధునాతన గోశాల తరహాలోనే వేములవాడలోనూ గోశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
వేములవాడ పరిధిలో 45 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. గోశాల పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెటర్నరీ వైద్యుడిని నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి దేవస్థానం ఈఓ, జిల్లా కలెక్టర్ స్థాయిలో చర్చించి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అనారోగ్యానికి గురైన కోడెలను వేరుగా ఉంచి అవసరమైన వైద్యం అందించేందుకు ఎకరం స్థలాన్ని వినియోగించనున్నట్లు వివరించారు.
భక్తులకు నిజ కోడె సమర్పించే అవకాశం
భక్తులు ఆలయంలో నిజ కోడెను సమర్పించే అవకాశం ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ఆలయ అధికారులను సంప్రదించి నిర్ణీత రుసుం చెల్లించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శ్రావణ మాసంలోని ఒక సోమవారం రోజున తొలిసారిగా 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయని తెలిపారు. వివిధ మొక్కుల టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. రాజన్నపై భక్తులకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు.
భక్తుల ఆరోగ్యానికి ప్రత్యేక వైద్య శిబిరాలు
భక్తుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ అధికారులతో చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా
భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనాలు, వసతులు, మొక్కులు చెల్లించుకునే సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.250 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ
భక్తులు సమర్పించిన కోడెలను గోశాలలో సంరక్షిస్తూ జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ ఈఓ, జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి, వ్యవసాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వెబ్‌సైట్ ద్వారా, ప్రెస్‌నోట్ జారీ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. రైతుల భూమి, పశువుల సంరక్షణకు అవసరమైన ఆహారం, నీరు, మేత అందించే సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హుల నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగతంగా పరిశీలించి కోడెలను అందిస్తున్నట్లు వివరించారు.
అనారోగ్యంతో లేదా బలహీన స్థితిలో ఉన్న కోడెలను చివరి దశలో గోశాలకు తీసుకురావడం వల్ల వాటిని సంరక్షించడం కష్టమవుతుందని కలెక్టర్ తెలిపారు. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న కోడెలను గోశాలలో వదిలివెళ్లకుండా.. ముందుగా గోశాల నిర్వాహకులను సంప్రదించి అధికారికంగా అప్పగించాలని భక్తులకు సూచించారు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న కోడెలను కొందరు భక్తులు చివరి దశలో తీసుకొచ్చి వదిలివెళ్తున్న పరిస్థితులను ఆలయ ఈఓ, పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. భక్తులు ఆలయ అధికారుల సూచన మేరకు కోడెలను సమర్పించాలని కోరారు.
కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ ఛైర్మన్ రాకేశ్, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే.ఎస్.బీ. కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, తహసీల్దార్ జయంత్, పలువురు కౌన్సిలర్లు, ఏఓలు, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.




