Jagtial: కొండగట్టు అంజన్నకు జాతీయ గౌరవం: నీతి ఆయోగ్ "దివ్య భారత్" పుస్తకంలో అంజన్న క్షేత్రం!
Jagtial: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి నీతి ఆయోగ్ రూపొందించిన ‘దివ్య భారత్’ పుస్తకంలో చోటు లభించింది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల జాబితాలో అంజన్న క్షేత్రం చేరడంపై భక్తుల హర్షం.
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశేషాలను పరిచయం చేస్తూ నీతీ ఆయోగ్ రూపొందించిన “దివ్య భారత్” పుస్తకంలో ఈ క్షేత్రానికి ప్రత్యేక స్థానం లభించడం విశేషం.
దేశంలోని పలు రాష్ట్రాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను ఒకేచోట సమగ్రంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక కేంద్రములపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం.
ఈ నేపథ్యంలో, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం ఎంపిక కావడం ప్రాంతీయంగా గర్వకారణంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాచీన, ప్రసిద్ధ ఆలయాలు ఉన్నప్పటికీ, వాటిలో కేవలం కొండగట్టు అంజన్న ఆలయానికే “దివ్య భారత్” పుస్తకంలో చోటు దక్కడం ప్రత్యేకతగా నిలిచింది.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం, తన ఆధ్యాత్మిక మహిమతో పాటు సహజసిద్ధమైన కొండల మధ్య ఉన్న అందమైన పరిసరాలతో కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. హనుమాన్ స్వామికి అంకితమైన ఈ క్షేత్రం భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది.
స్థానిక ప్రజలు, భక్తులు ఈ గుర్తింపును ఆనందంతో స్వాగతిస్తూ, ఆలయానికి దేశస్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవంతో కొండగట్టు అంజన్న క్షేత్రం దేశ పర్యాటక పటంలో మరింత ప్రాముఖ్యతను సంపాదించనుంది.




