Karimnagar: ఏపీ నుంచి కరీంనగర్‌కు డ్రగ్స్ సప్లై.. మెడికల్ షాప్‌పై కూడా కేసు!
Karimnagar: కరీంనగర్‌లో హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న 9 మంది యువకులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Karimnagar: ఏపీ నుంచి కరీంనగర్‌కు డ్రగ్స్ సప్లై.. మెడికల్ షాప్‌పై కూడా కేసు!
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలాం రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు.
కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు, బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందింది. దీంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, రూరల్ ఇన్‌స్పెక్టర్,ఎస్‌ఐ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా గుమిగూడి ఉన్న తొమ్మిది మంది వ్యక్తులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వారు కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల మరియు సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీష్, కోసిని బాలచంద్ర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్గా తమ వివరాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం
పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో సుమారు రూ.7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం
నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అలాగే గంజాయిని వినియోగించడంతో పాటు, హాష్ ఆయిల్‌ను ప్రత్యేక పరికరాల ద్వారా పొగ రూపంలో తీసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు
నిందితుల వద్ద తనిఖీ నిర్వహించగా సుమారు 500 గ్రాములు/మిల్లీలీటర్ల హాష్ ఆయిల్, సుమారు 500 గ్రాముల గంజాయి,60 డ్రగ్ ట్యాబ్లెట్లు,14 సిరంజీలు హాష్ ఆయిల్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు 8 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల ప్రభుత్వ అంచనా విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్వాధీనం ప్రక్రియను పంచుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు విచారణలో నిందితుల్లో ఒకరు డీమార్ట్ సమీపంలోని మెడికల్ షాప్ నుంచి డ్రగ్ ట్యాబ్లెట్లను తరచుగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అతని సమాచారం మేరకు సంబంధిత మెడికల్ షాప్‌కు వెళ్లి తనిఖీ నిర్వహించడంతో పాటు, షాప్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించాలని కరీంనగర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం తదితర అంశాలపై సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత కూడా మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళనకరమైన విషయమని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను విక్రయించే లేదా సరఫరా చేసే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కేసులో నమ్మదగిన సమాచారం సేకరించి, చాకచక్యంగా దాడి నిర్వహించి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి పోలీస్ సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలాం, రూరల్ ఏసీపీ ఏ. విజయ్ కుమార్ అభినందించారు.




