Karimnagar: ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్!

Karimnagar: కరీంనగర్ నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న ఫిల్టర్ బెడ్‌ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి, నాణ్యతలో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 14 Aug 2026 11:53 PM IST
Karimnagar
X

Karimnagar: ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్!

కరీంనగర్: కరీంనగర్ నగర ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై ఇటీవల వెలువడిన వార్తలు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్సిపల్ అధికారులతో కలిసి నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్‌లో జరుగుతున్న నీటి శుద్ధీకరణ ప్రక్రియ, ఫిల్టరేషన్ వ్యవస్థ, క్లోరినేషన్, నిల్వ ట్యాంకులు, శుద్ధి చేసిన నీటి నాణ్యతతో పాటు నగరానికి నీటి సరఫరా జరుగుతున్న విధానాన్ని మేయర్ స్వయంగా పరిశీలించారు. ఇటీవల నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రంగుమారిన, మడ్డితో కూడిన నీరు సరఫరా అవుతోందన్న ఫిర్యాదులను మేయర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన తాగునీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఫిల్టర్ బెడ్ నుంచి బయటకు వెళ్లే ప్రతి లీటర్ నీరు పూర్తిగా శుద్ధి చేయబడి, నిర్ణీత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి” అని అధికారులను ఆదేశించారు. నీటి శుద్ధీకరణలో ఉపయోగించే ఆలం, క్లోరిన్ తదితర రసాయనాలను అవసరమైన మోతాదులో వినియోగించాలని, ఫిల్టర్లను నిర్ణీత వ్యవధిలో శుభ్రపరచాలని సూచించారు. ఫిల్టర్ బెడ్‌లో ఏవైనా సాంకేతిక లోపాలు లేదా నిర్వహణ సమస్యలు ఉంటే వాటిని యుద్ధ ప్రాతిపదికన గుర్తించి తక్షణమే సరిచేయాలని ఇంజినీరింగ్, వాటర్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తాగునీటి నమూనాలను సేకరించి క్రమం తప్పకుండా నాణ్యత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అవసరమైన చోట పైప్‌లైన్ లీకేజీలు, కలుషిత నీరు కలిసే అవకాశాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. వర్షాకాలంలో నీటి కలుషితానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మేయర్ సూచించారు. ఫిల్టర్ బెడ్ నుంచి ప్రజల ఇంటి వరకు నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడం కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రథమ బాధ్యత అని, ఇకపై తాగునీటి నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. తాగునీటి సరఫరాపై ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ప్రజలు వెంటనే నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకురావాలని మేయర్ కోరారు.

ఈ తనిఖీలో మేయర్ వెంట కార్పొరేటర్లు మాసం గణేష్, ఏపీపీ చంద్ర, గాజా రమ శివరాం, భారీ అపర్ణ జితేందర్, ఎస్‌ఈ సంపత్ రావు, డీఈ దేవేందర్ రెడ్డి, ఏఈ రఘువర్ధన్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story