Karimnagar: ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు టోకరా - నిందితుడు అరెస్ట్

Karimnagar: కరీంనగర్‌లో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు వసూలు చేసి నకిలీ పరీక్షలు నిర్వహించిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar
Published on: 8 Sept 2026 4:03 PM IST
Karimnagar
X

Karimnagar: ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు టోకరా - నిందితుడు అరెస్ట్

కరీంనగర్: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి సుమారు రూ.40 లక్షలు వసూలు చేసిన మోసగాడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో బాటనీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్లు నమ్మిస్తూ యువతీ యువకులను ఆకర్షించిన తిరుపతి అనే వ్యక్తి.. మరో ఏడుగురితో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు రైల్వే, విద్యాశాఖతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు 22 మంది నిరుద్యోగులను నమ్మించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులకు మరింత నమ్మకం కలిగించేందుకు ముఠాలోని సభ్యులను నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిచయం చేశారు.

ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్న అనంతరం.. ఒక ఇంట్లోనే ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా నకిలీ పరీక్షలు పెట్టారు. ఇందుకోసం ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను తయారు చేశారు. పరీక్ష అనంతరం ఉద్యోగానికి ఎంపికైనట్లు చూపించేందుకు నకిలీ నియామక ఉత్తర్వులు సిద్ధం చేశారు. పలువురు ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, ప్రభుత్వ స్టాంపులను కూడా ఉపయోగించారు.

అంతేకాకుండా ఉద్యోగం ఖరారైనట్లు బాధితులు పూర్తిగా నమ్మేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ బుక్స్‌ను సైతం నకిలీవి తయారు చేసి ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇలా ఒక్కో బాధితుడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి నకిలీ నియామక పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, సర్వీస్ బుక్స్ తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులు.. గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని కరీంనగర్ పోలీసులు సూచించారు.

ఈ కేసును ఛేదించిన కరీంనగర్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి, సీసీఎస్ సిబ్బందిని కరీంనగర్ పట్టణ ఏసీపీ అభినందించారు.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న సీనియర్ పాత్రికేయులు మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.

Next Story