Karimnagar: కార్పొరేట్ తరహా విద్య, వైద్యమే ప్రభుత్వ లక్ష్యం!
Karimnagar: కరీంనగర్ GGH అభివృద్ధి సంఘం సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ చిత్రా మిశ్రా. ఆసుపత్రి అభివృద్ధిపై కీలక ఆదేశాలు.
Karimnagar: కార్పొరేట్ తరహా విద్య, వైద్యమే ప్రభుత్వ లక్ష్యం!
Karimnagar: కార్పొరేట్ తరహా విద్య, వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు, నూతన భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తోందని తెలిపారు. వైద్య రంగంలో మెడికల్ కళాశాలలు అత్యంత కీలకమని అన్నారు. వీటికి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు నిరుపేదలు ఎక్కువగా వస్తుంటారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పై దృష్టి పెట్టాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రి అవుట్ పోస్ట్ వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రిలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, ఇంజనీరింగ్ మున్సిపల్ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి కోసం 40 లక్షల రూపాయల మంజూరు చేశామని తెలిపారు. ఆస్పత్రిలో కనీస అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు. జి జి హెచ్ లో సెక్యూరిటీ లోపం లేకుండా చూడాలని, అవసరమైతే మరింత మందిని నియమించాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాల్లో పారిశుధ్యంతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
ఆస్పత్రి అభివృద్ధి సంఘం చైర్ పర్సన్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇది ప్రజలతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సదరం, వెల్నెస్ సెంటర్, మందులు ఇచ్చే చోటు, చాలా ముఖ్యమైనవని, ఇక్కడ రోగులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు అందించడంతోపాటు వారి సేవలను పర్యవేక్షించాలని అన్నారు. ఆస్పత్రికి వచ్చే వివిధ రకాల ఆదాయాలపై దృష్టి పెట్టాలని, తద్వారా మరింత అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఆస్పత్రి కనీస అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి సంఘం ఆమోదం పొందిన పనులు నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్యాధికారి, జి జి హెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తక్యుద్దీన్ ఖాన్, ఆర్ఎంవో నవీన, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.




