Karimnagar: కరీంనగర్ జిల్లాలో 74 శాతం డిజిటలైజేషన్ పూర్తి.. కలెక్టర్
Karimnagar: కరీంనగర్ జిల్లాలో 74.01 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు.
Karimnagar: కరీంనగర్ జిల్లాలో 74 శాతం డిజిటలైజేషన్ పూర్తి.. కలెక్టర్
కరీంనగర్: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, ఎన్యూమరేషన్ ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రతి బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) రోజుకు కనీసం 100 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. జూలై 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఓటర్ల వివరాలు డిజిటలైజ్ కాగా, గత ఏడు రోజుల్లో కేవలం 22 లక్షల వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయని, ఈ పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని జిల్లాలు పనిచేయాలని ఆదేశించారు.
పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పురోగతి చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, వచ్చే వారం గరిష్ఠ స్థాయిలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితా వివరాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారనే వదంతులను జిల్లా యంత్రాంగం ఖండించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంలో ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్ఛికం మాత్రమేనని, బీఎల్‌వోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ నంబర్ ఇవ్వాలని ఓటర్లపై ఒత్తిడి చేయరాదని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ఓటర్లను మళ్లీ ఆఫ్‌లైన్ ఫారం ఇవ్వాలని కోరడం అవసరం లేదన్నారు. కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంటూ, ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా బీఎల్‌వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫారం నింపడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, ఈ ప్రక్రియపై రూపొందించిన అవగాహన వీడియోలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు.
కొంతమంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని, మరికొందరి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాగే జీవించి ఉన్న కొంతమంది ఓటర్లను మరణించిన వారిగా నమోదు చేసిన ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయని, ఇలాంటి పొరపాట్లను వెంటనే గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
అధికారులందరూ తమ మొబైల్ నంబర్లను సంబంధిత వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. 50 శాతం కంటే తక్కువ డిజిటలైజేషన్ పురోగతి ఉన్న పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 74.01 శాతం డిజిటలైజేషన్..
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్ జిల్లా డిజిటలైజేషన్ పురోగతిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. జిల్లాలో మొత్తం 74.01 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా కరీంనగర్ – 59.18 శాతం, చొప్పదండి – 84.11 శాతం, మానకొండూర్ – 86.19 శాతం, హుజూరాబాద్ – 75.18 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. వచ్చే ఆదివారం నాటికి జిల్లాలో 90 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని, అలాగే ASD (Absentee, Shifted, Death) జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా జిల్లా ఎన్నికల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా ఎలాంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి బీఎల్‌వో నిర్దేశించిన రోజువారీ లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో జల కుమారి, తహసీల్దార్లు లక్ష్మీనరసింగరావు, రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.




