Karimnagar: కరీంనగర్‌లో సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు!
Karimnagar: కరీంనగర్‌లో సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఏచూరి స్ఫూర్తితో ఐక్య ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి వెల్లడి.
Karimnagar: కరీంనగర్‌లో సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు!
Karimnagar: లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ పరిరక్షణ కోసం చివరి కంటూ పోరాడిన కామ్రేడ్ సీతారాం ఏచూరి స్ఫూర్తితో జిల్లాలో ఐక్య ప్రజా ఉద్యమాలను బలోపేతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు.
పార్టీ కార్యాలయం ముకుంద లాల్ మిశ్రా భవన్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతిసారి ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించి, గొంతెత్తిన మార్గదర్శి ఏచూరి అన్నారు. కార్మికులు, కర్షకులు, రైతులు పేదలు అణగారినవర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఎర్రజెండా ముద్దుబిడ్డ అని కొనియాడారు.
విద్యార్థి దశ నుండే ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తూ పదునైన వాదనలు చేసేవారన్నారు. మార్క్సిజంపై లోతైన అధ్యయనం ప్రజా ఉద్యమాల పట్ల అచంచలమైన నిబద్ధత ఆయన రాజకీయ జీవితానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని అన్నారు. మార్క్సిజాన్ని కేవలం అధ్యయనం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతాన్ని ప్రజా జీవితంలో ఆచరణకు తీసుకువచ్చిన గొప్ప దార్శనికుడు ఏచూరి అన్నారు. దేశంలోనే ఖ్యాతిగాంచిన జేఎన్యూలో విద్యనభ్యసించడంతోపాటు యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి రెండు దఫాలుగా అధ్యక్షుడిగా ఎన్నికై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు.
కేంద్ర కమిటీ సభ్యుడిగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రతి పౌరుడిని కలుపుకొని వెళ్లే వ్యవస్థ కావాలని, వ్యక్తి ఏ మతానికి చెందిన వాడైనా, ఏ భాష మాట్లాడిన ఏ ప్రాంతానికి చెందిన వాడైనా, స్త్రీ అయినా పురుషుడైన అందరికీ సమాన హక్కులు ఉండాలని ఆయన పదేపదే స్పష్టం చేసే వారన్నారు. సాంప్రదాయక రాజకీయ విభేదాలను దాటి ఆయన ఇండియా ప్రతిపక్ష కూటమి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు.
వివిధ రాజకీయ పార్టీలను ఒకే వేదిక పైకి తీసుకురావడానికి తీవ్రమైన కృషి చేసి ఎన్నికల్లో బిజెపిని దేశవ్యాప్తంగా నిలువరించడంలో సక్సెస్ అయ్యారన్నారు. 12 సంవత్సరాల పాటు రాజ్యసభ ఎంపీగా పనిచేశారని ఈ కాలంలో శ్రామిక ప్రజల, విభిన్న వర్గాల ప్రజల సమస్యలను లేవనెత్తడానికి, పరిష్కారానికి సమర్థవంతమైన కృషి చేశారన్నారు.
ఆయన చేసిన విశ్లేషణాత్మక ఆధారాలతో కూడిన ప్రసంగాలు స్పష్టంగా సిపిఎం వామపక్ష రాజకీయాల వైఖరులను ప్రజల ముందు ఉంచారన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి తమ విలువైన సేవలు అందిస్తూనే అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రతి పోరాటంలో ఆయన ఆలోచనలు, చూపిన మార్గం స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.
దేశంలో మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా, దోపిడీ లేని, అంతరాలు లేని సమాజం కోసం తీవ్రమైన కృషి చేశారన్నారు. వారి పోరాటస్ఫూర్తితో జిల్లాలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, జి రాజేశం, డి నరేష్ పటేల్, నాయకులు పుల్లెల మల్లయ్య, కనకరాజు, శివ, శ్రీకాంత్, సంజన, తదితరులు పాల్గొన్నారు.




