Karimnagar: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శలు
Karimnagar: కరీంనగర్లో సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను, రాష్ట్రంలో ధరణి సమస్యలు, అధికారుల అవినీతిని ఎండగట్టారు.
Karimnagar: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శలు
కరీంనగర్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుందని, ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ధారా దత్తం చేస్తుందని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. నేడు సిపిఐ కార్యాలయంలో చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను 22 వేల కోట్ల రూపాయలను కార్పొరేట్ శక్తులకు మాఫీ చేసిందని, పేదలు రైతులు తీసుకున్న రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని, దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని వెంకటరెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ప్రాంతానికి గోదావరి జలాలు అవసరమని ఎత్తిపోతల ద్వారానే తెలంగాణకు నీళ్లు అందుతాయాన్నే సంకల్పంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞానికి పూనుకోవడంతో శాసనసభలో సిపిఐ సంపూర్ణ మద్దతు తెలిపిందని, ఎల్లంపల్లి శంకుస్థాపనలో అనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యులమంతా భాగస్వాములు అయ్యామని,తుమ్మిడి హెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేస్తే శాశ్వతంగా సాగు, త్రాగునీటికి సంపూర్ణ పరిష్కారం దొరుకుతుందని, ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, అందుకోసం కేంద్రంలో,మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వంతో బ్యారేజీ నిర్మాణానికి మాట్లాడడానికి తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ కృషి చేయాలని అన్నారు.
2021 లో ధరణి పోర్టల్ చట్టం తెచ్చినప్పుడు అందులో అనేక లొసుగులు చోటు చేసుకుంటాయని, సమస్యలు ఉత్పన్నమవుతాయని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టంగా చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారని, నేడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్లకే వైరస్ వచ్చి డాటా అంత పోతుందని అలాంటిది ఈ పోర్టల్ కు వైరస్ వస్తే భూముల డాటా కూడా పోతుందని వివరించామని అయినప్పటికీ వినకుండా ఆ చట్టం తెచ్చారని, నేడు 22ఏ మూలంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక భూ సమస్యలు తలెత్తుతున్నాయని, మల్కాజ్గిరి, ఇతర ప్రాంతాలలో 22 ఎ లోకి భూములు వెళ్లడం మూలంగా అక్కడి ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారన్నారు. రియల్ ఎస్టేట్ భూ దందాలు చేసేవారు నిషేధిత భూములను, పట్టాలు చేయించుకుంటున్నారని, చివరకు వ్యవసాయ భూములను కూడా వదలకపోవడం దుర్మార్గమని ప్రభుత్వం వీటిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు మంచి చేయాలని,రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఒకవైపు ఆయన ప్రయత్నిస్తుంటే మరొకవైపు అధికార యంత్రాంగంలో మాత్రం విధుల పట్ల,బాధ్యతల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, జవాబుదారితనం లేకుండా పోతుందని, అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని, ఇటీవలి కాలంలో చూస్తే రెవెన్యూ,ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అనేక డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులు ఏసీబీ ట్రాప్ లల్లో దొరుకుతే వారి వద్ద వందలాది కోట్ల రూపాయలు ఉండడం చూస్తుంటే అధికార యంత్రాంగం ఏ విధంగా అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారో అర్థమవుతుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల బదలాయింపు కోసం, ఇతర పనులపై వచ్చే వారి నుండి యంత్రాంగం అధిక మొత్తంలో చేతులు మారుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే చొరవ తీసుకొని యంత్రాంగ ప్రక్షాళన చేయాలని అందుకోసం అవసరమైతే అనుభవజ్ఞులైన రాజకీయ విశ్లేషకులతో, రిటైర్ అధికారులతో సంప్రదింపులు జరిపి పరిపాలనలో ప్రజలకు జవాబుదారీతనంగా, పారదర్శకతగా, అవినీతికి తావు లేకుండా చేయాలని వెంకటరెడ్డి సూచించారు.
సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు కరీంనగర్ లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి మహాసభల విజయవంతం కోసం కార్మిక లోకం కదిలి రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,బోయిని అశోక్,టేకుమల్ల సమ్మయ్య,, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, మచ్చ రమేష్,నాయకులు బాకం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.




