Karimnagar: గోల్డ్ షోరూమ్‌లలో అలారమ్స్ ఉండాల్సిందే.. సీపీ
Karimnagar: కరీంనగర్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Karimnagar: గోల్డ్ షోరూమ్‌లలో అలారమ్స్ ఉండాల్సిందే.. సీపీ
Karimnagar: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు పలు బంగారు ఆభరణాల షోరూంలు, లాడ్జీలు, బస చేసే హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, వేణుగోపాల్, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్ రాంచందర్ రావుతో పాటు స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమీషనర్ గౌష్ ఆలం హోటళ్లు, జ్యువెలరీ షోరూంల నిర్వాహకులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బంగారు ఆభరణాల షోరూంలలో కట్టుదిట్టమైన భద్రత. జ్యువెలరీ దుకాణాల్లో ఖచ్చితంగా అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. షోరూంల ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (DFMD), లోపలికి వచ్చే వారిని తనిఖీ చేయడానికి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లను (HHMD) ఖచ్చితంగా ఉపయోగించాలని ఆదేశించారు.
ఎమర్జెన్సీ అలారమ్స్ ఏర్పాటు..
అత్యవసర సమయాల్లో అప్రమత్తం చేయడానికి దుకాణాల్లో పలు చోట్ల 'ఎమర్జెన్సీ అలారమ్స్' అమర్చాలని, వాటిని నొక్కిన వెంటనే పోలీసులకు సమాచారం అందేలా అధునాతన సాంకేతికతను అనుసంధానం చేసుకోవాలన్నారు. హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులకు ఆదేశాలు.
హోటళ్లలో రూమ్ లు అద్దెకు ఇచ్చే సమయంలో కస్టమర్ల నుంచి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను సేకరించాలి. వారు ఇచ్చే ఫోన్ నంబర్లను క్రాస్ చెక్ (నిజమా కాదా అని సరిచూసుకోవడం) చేసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలి.
సీసీ కెమెరాల పర్యవేక్షణ..
అన్ని వ్యాపార సముదాయాలు, హోటళ్లలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని, వాటి విజువల్స్ స్పష్టంగా ఉండేలా బ్యాకప్ సామర్థ్యం సరిగ్గా ఉండాలని స్పష్టం చేశారు.
నగరంలో ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని, వ్యాపార సంస్థల నిర్వాహకులు పోలీసుల నిబంధనలకు లోబడి వ్యాపారాలు నిర్వహించి, నగర భద్రతలో భాగస్వాములు కావాలని సిపి గౌష్ ఆలం పిలుపునిచ్చారు. భద్రతా ప్రమాణాల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.




