Karimnagar: ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి
Karimnagar: కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
Karimnagar: ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి
కరీంనగర్: జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్-2010 అమలు, ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతుల జారీ ప్రక్రియపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రుల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కోకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులను సంబంధిత అధికారులు సంయుక్తంగా సమన్వయంతో తనిఖీలు చేయాలని సూచించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతులను పరిశీలించిన అనంతరం మాత్రమే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్ఓసీలు) జారీ చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
మూడు నెలల లోపల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. హెల్ప్‌లైన్ ద్వారా ఇతరత్రా ఇబ్బందులు..రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సందేహాలు, సాంకేతిక సమస్యలు, అనుమతుల అంశాలపై మార్గదర్శకత్వం అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రైవేట్ వైద్య సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ తెలిపారు.
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్-2010 ప్రకారం అన్ని వైద్య సంస్థలు రిజిస్ట్రేషన్ పొందడం ద్వారా వైద్య సేవల నాణ్యత, పారదర్శకత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరామ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పోలీసు శాఖ ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేష్ కోశాధికారి నీలిమా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




