Karimnagar: కేటీఆర్ ఫామ్‌హౌజ్ స్క్రిప్ట్‌లు చదువుతున్నారు - బీజేపీ
Karimnagar: కేటీఆర్ ఫామ్‌హౌజ్ స్క్రిప్ట్ చదవడానికే పరిమితమయ్యారని బీజేపీ కరీంనగర్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. బండి సంజయ్‌పై వ్యాఖ్యలను ఖండన.
Karimnagar: కేటీఆర్ ఫామ్‌హౌజ్ స్క్రిప్ట్‌లు చదువుతున్నారు - బీజేపీ
కరీంనగర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సొంత పరిజ్ఝానం లేదని, ఫాంహౌజ్ నుండి వచ్చిన స్క్రిప్ట్ చదవడానికే పరిమితమయ్యారని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్, బోయినిపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. కరీంనగర్ లో నిర్వహించిన సమర భేరీలో కేటీఆర్ ఫాంహౌజ్ నుండి వచ్చిన 12 పేజీల స్ర్కిప్ట్ ను మాత్రమే వల్లె వేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు ప్రవీణ్ రావు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలెవరినీ నమ్మడం లేదు. ఎవరు ఏ కార్యక్రమం నిర్వహించాలి? ఎవరు ఏం మాట్లాడాలనే అంశంపై ఫాంహౌజ్ లో తీసుకున్న నిర్ణయంతోపాటు అక్కడే రాసిచ్చిన స్ర్కిప్ట్ ను మాత్రమే చదివిస్తున్నారు. ఆఖరుకు కన్న కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావును కూడా కేసీఆర్ నమ్మడం లేదు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలపై చేపట్టే నిరసన కార్యక్రమాల డిజైన్లు, ఫ్లెక్సీలు సైతం ఫాంహౌజ్ నుండే బయటకు వస్తున్నాయి.
కేటీఆర్, హరీష్ రావులతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినందువల్లే ఫాంహౌజ్ నుండే స్క్రిప్ట్ లు వెళుతున్నాయి. సొంతంగా తన భావాన్ని కూడా వ్యక్తం చేయలేని కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను విమర్శించే నైతిక అర్హత లేదు. బీఆర్ఎస్ లో పూర్తిగా ఒంటెద్దు పోకడలకే పరిమితమవుతోంది.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ ను సైతం సమర భేరీ సభలో మాట్లాడించే పరిస్థితి లేదంటే ఆ పార్టీ ఒంటెద్దు పోకడలను అర్ధం చేసుకోవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కు ఎన్ని నిధులు తీసుకొచ్చారో, ఎన్ని పోరాటాలో చేశారో పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంటికి వెళ్లినా చెబుతారు. బండి సంజయ్ ను విమర్శించడమంటే ఆకాశంపై ఉమ్మి వేసినట్లే. ఇకనైనా కేటీఆర్ నోటిని అదుపులో పెట్టకుని మాట్లాడాలి. లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ది చెబుతారు అని అన్నారు.




