Karimnagar: బండి సంజయ్ ఆఫీస్ ముట్టడి యత్నంపై భగ్గుమన్న కమలం శ్రేణులు!
Karimnagar: కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Karimnagar: బండి సంజయ్ ఆఫీస్ ముట్టడి యత్నంపై భగ్గుమన్న కమలం శ్రేణులు!
కరీంనగర్: ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళన బాటలోనే, కరీంనగర్‌లోనూ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.కరీంనగర్ పార్లమెంటు కార్యాలయం వైపు దూసుకొచ్చిన కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేంద్ర మంత్రి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నిరసనలను వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి కోసం దేశ వ్యతిరేక శక్తులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన చిల్లర పార్టీగా మారిన కాంగ్రెస్ , బిజెపిని ఎదుర్కోలేక అశాంతి అల్లర్లు సృష్టించాలని దేశ వ్యతిరేక శక్తులతో కలిసి కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. నీట్ పరీక్ష విషయంలో తప్పులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ, ఢిల్లీలో విధ్వంసకర ఆందోళనలు చేపట్టడం సిగ్గుచేటన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన పేరుతో అరాచక రాజకీయాలకు పాల్పడటం హేయనీయమని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ కుట్రపూరిత ఆందోళనలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో బీజేపీ ముందుకు వెళ్తుందని, ఇలాంటి చౌకబారు బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని, బీజేపీతో పెట్టుకుంటే తడాఖా చూపిస్తామని, ఖబర్దార్ అని గంగాడి కృష్ణారెడ్డి హెచ్చరించారు.




