Karimnagar: కల్యాణలక్ష్మిపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం మానుకోవాలి: కాంగ్రెస్ నేత!

Karimnagar: రాజకీయంగా వాడుకుంటూ బీఆర్‌ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వీణవంక మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్ మండిపడ్డారు.

GANESH, JAMMIKUNTA
Published on: 18 Aug 2026 5:32 PM IST
Karimnagar
X

Karimnagar: కల్యాణలక్ష్మిపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం మానుకోవాలి: కాంగ్రెస్ నేత!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టులో కొనసాగుతున్న న్యాయ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్రగా చిత్రీకరించడం బీఆర్‌ఎస్ నాయకుల రాజకీయ దుష్ప్రచారం తప్ప మరొకటి కాదని మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్ విమర్శించారు.

కోర్టులో కేసు ఉన్నప్పుడు ప్రభుత్వం న్యాయస్థానంలో తన వాదనను సమర్థంగా వినిపించాల్సి ఉంటుందని, అయితే న్యాయ ప్రక్రియను రాజకీయంగా వక్రీకరించి పేద ఆడబిడ్డలను భయపెట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.కల్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, అదే పథకం అమలుకు ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయిస్తుందని ప్రశ్నించారు. ఈ ఒక్క ప్రశ్నకు బీఆర్‌ఎస్ నాయకులు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పేదింటి ఆడబిడ్డలపై నిజంగా ప్రేమ ఉంటే కోర్టులో కొనసాగుతున్న కేసు అసలు వివరాలను ప్రజలకు వెల్లడించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం కేసుల అంశాన్ని వక్రీకరించడం మానుకోవాలని సూచించారు. న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని ప్రజల ముందు రాజకీయ ప్రచార అస్త్రంగా ఉపయోగించడం సరికాదన్నారు.

గత పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు మరువలేనివి.గత బీఆర్‌ఎస్ పాలనలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల అమలులో రాజకీయ జోక్యం, జాప్యం, అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆరోపించారు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగిన పరిస్థితులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని అన్నారు.

సంక్షేమ పథకాలను రాజకీయ ప్రయోజనాలకు.ఉపయోగించుకున్నారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు వేగంగా చెక్కులు అందిస్తూ సంక్షేమ పథకాలను ప్రజల గడపకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ మార్పును హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు స్వయంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.

అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్ నాయకులకు అసహనం

పేదల సంక్షేమం పేరుతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాదని, పేదల కోసం నిజాయితీగా పనిచేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సాహెబ్ హుస్సేన్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వొడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్ నాయకులు అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. ప్రజల మధ్య కనిపించేందుకు ఏదో ఒక అంశాన్ని పట్టుకుని రోడ్డెక్కడం తప్ప బీఆర్‌ఎస్ నాయకుల వద్ద ప్రజలకు చెప్పడానికి కొత్తగా ఏమీ లేదన్నారు.ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎవరు మాటలు చెబుతున్నారో.ఎవరు చేతల్లో పనిచేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసు ఎండీ సాహెబ్ హుస్సేన్ అన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story