Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో కాళోజీ జయంతి వేడుకలు!
Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు.. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కమాండెంట్ ఛటర్జీ!
Sircilla: 17వ పోలీస్ బెటాలియన్‌లో కాళోజీ జయంతి వేడుకలు!
Sircilla: తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త, సామాజిక చైతన్యవాది కాళోజీ నారాయణరావు 112వ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్‌లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న జన్మించారని, ఆయన జయంతిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ తెలంగాణ భాష, యాస, సాహిత్యం, సంస్కృతిని స్మరించుకుంటోందన్నారు. తెలంగాణ సాహిత్య, సామాజిక, ప్రజా ఉద్యమ చరిత్రలో కాళోజీ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
సామాన్య ప్రజల జీవన పరిస్థితులు, వారి సమస్యలు, సామాజిక అసమానతలు, ప్రజాస్వామ్య విలువలను తన రచనలు, కవితలు, వ్యాసాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. ‘ప్రజాకవి’గా పేరుగాంచిన కాళోజీ.. అన్యాయాలు, అక్రమాలు, వివక్ష, అణచివేతలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారని అన్నారు.
తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సామాన్య ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యాన్ని అందించిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. ఆయన సామాజిక బాధ్యత, మానవతా దృక్పథం, ప్రజాస్వామ్య భావాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
యువత కాళోజీ సాహిత్యాన్ని చదివి ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య అభివృద్ధికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సంజీవ రెడ్డి, బెటాలియన్ అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులర్పించారు.




