Yellareddypet: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు

Yellareddypet: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్, మండల పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Aug 2026 5:43 PM IST
Yellareddypet
X

Yellareddypet: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్, ఎల్లారెడ్డిపేట మండల పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిజిటల్ భద్రత, ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచార రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేశ్ మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, నకిలీ వెబ్‌సైట్లు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ వెంకటేశ్ తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు.

విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నర్సింహులు, కళాశాల ఇంచార్జి కె. సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story