Sircilla: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగింది!
Sircilla: కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగిందని, ప్రభుత్వం రాజకీయ బేషజాలు స్వస్తి చెప్పి నీటిని వినియోగించుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Sircilla: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగింది!
Sircilla: బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలవిద్యుత్ పరిశోధనా సంస్థ నివేదికను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగిందని జీవన్ రెడ్డి తెలిపారు. కేంద్ర జలవిద్యుత్ పరిశోధనా సంస్థ నివేదికలో ఏడో బ్లాక్ నాణ్యతపై మాత్రమే ప్రశ్నలు ఉన్నాయని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగున్నాయని పేర్కొన్నట్లు చెప్పారు. ఒకటి నుంచి ఆరో బ్లాక్‌లతో పాటు ఎనిమిదో బ్లాక్ కూడా బాగున్నట్లు నివేదికలో ఉందన్నారు.
కాళేశ్వరం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాజకీయ బేషజాలకు పోకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద వృథాగా పోతున్న నీటిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
ఉత్తర తెలంగాణ రైతాంగానికి ప్రాణహిత నది ప్రధాన ఆధారమని జీవన్ రెడ్డి అన్నారు. కన్నెపల్లి దిగువన కాపర్ డ్యామ్ నిర్మించి, వృథాగా పోతున్న ప్రాణహిత నది జలాలను పంటల రక్షణకు వినియోగించాలని కోరారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర జల సంఘం నివేదిక పేరుతో ఇన్నాళ్లు దాగుడుమూతలు ఆడారని, ఇప్పుడు నివేదిక వచ్చిన నేపథ్యంలోనైనా రాజకీయ బేషజాలను పక్కనపెట్టి సాగు, తాగునీటి సమస్యలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కోరారు.
సాగునీటి సమస్యతో పాటు భవిష్యత్‌లో తాగునీటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని జీవన్ రెడ్డి హెచ్చరించారు. రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు.




