Jagtial: జగిత్యాల ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగి - లంచం తీసుకుంటూ పట్టివేత

Jagtial: జగిత్యాల జిల్లా బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఆర్ఐ రాహుల్. రూ.30 వేల లంచం సొమ్ము స్వాధీనం, కేసు నమోదు.

ANAND, JAGITYAL
Published on: 13 Aug 2026 7:16 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగి - లంచం తీసుకుంటూ పట్టివేత

జగిత్యాల: జగిత్యాల జిల్లా బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ రెవెన్యూ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. బాధితురాలి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఘటన వివరాలు: బీర్పూర్ మండల పరిధిలోని ఓ బాధితురాలికి చెందిన 12 గుంటల భూమిని 'సాదా బైనామా' ద్వారా 'భూభారతి' కార్యక్రమంలో పట్టా చేయించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుపై విచారణ (ఎంక్వైరీ) జరిపి నివేదిక సమర్పించాల్సిన గిరిధావర్ (ఆర్ఐ) రాహుల్... పని పూర్తి చేయకుండా జాప్యం చేస్తూ వచ్చాడు. నివేదిక ఇచ్చేందుకు బాధితురాలి నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు.

చివరకు రూ. 40 వేలకు ఒప్పందం కుదరగా, బాధితురాలు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం... గురువారం తహసీల్దార్ కార్యాలయంలో రాహుల్ బాధితురాలి నుంచి మొదటి విడతగా రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, రాహుల్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story