Jagtial: అధికారుల అక్రమ మైనింగ్ వల్లనే సుశాంత్ మృతి!
Jagtial: జగిత్యాల మల్యాల గురుకుల పాఠశాల విద్యార్థి సుశాంత్ మృతి అధికారుల నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు.
Jagtial: అధికారుల అక్రమ మైనింగ్ వల్లనే సుశాంత్ మృతి!
Jagtial: అధికారుల నిర్లక్ష్యం, అక్రమ మైనింగ్ వల్లే మల్యాల ఎస్టీ గురుకుల పాఠశాల 4వ తరగతి విద్యార్థి సుశాంత్ గుంతలో పడి మరణించాడని మాజీ మంత్రి, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన సుశాంత్ కుటుంబాన్ని జిల్లా కేంద్రంలోని టి ఆర్ నగర్లో ఆయన పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా రెవెన్యూ, మైనింగ్ అధికారుల అండదండలతోనే భీమన్న గుట్ట వద్ద అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్విన గుంతల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ఇది సాధారణ మరణం కాదని, అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనని మండిపడ్డారు. గతంలో నర్సింగాపూర్ గుట్ట వద్ద కూడా ఇలాంటి ఘటనలోనే ఒక బాలుడు మరణించినా అధికారుల్లో మార్పు రాలేదన్నారు.
ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ (HRC), ఎస్టీ కమిషన్ మరియు పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. జిల్లాలో గుట్టల అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి, అవసరమైన మట్టి కోసం వరద కాలువ మట్టిని వినియోగించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల గూగుల్ మ్యాప్స్ ఆధారంగా గుట్టల ధ్వంసంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
మృతి చెందిన సుశాంత్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారంతో పాటు, టి ఆర్ నగర్లో నివేదన పట్టా ఇచ్చి రూ.6 లక్షలతో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేవేందర్ నాయక్, సర్పంచులు శీలం సురేందర్, వంశీ, నాయకులు సిరాజ్, రజనీకాంత్, సురేష్, తిరుపతి, బాబూమియ్య, జిలాని, మైపాల్ తదితరులు పాల్గొన్నారు




