Sircilla: చేనేత రంగానికి అండగా ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కలెక్టర్ గరిమ పూలమాల వేసి నివాళులర్పించారు.
Sircilla: చేనేత రంగానికి అండగా ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్!
Sircilla: నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని నేతన్న విగ్రహానికి జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల చేనేత, వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. సిరిసిల్లలోని నేతన్నలు, కార్మికులు, ఆసాములు, యజమానులకు సంవత్సరంలో సుమారు ఎనిమిది నెలల పాటు పని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
గత ఏడాది 6 కోట్ల 70 లక్షల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని, ఈ ఏడాది ఇప్పటికే 4 కోట్ల 50 లక్షల మీటర్ల చీరల తయారీకి అవకాశం కల్పించామని తెలిపారు. త్వరలో మరో కోటి 50 లక్షల మీటర్లకు పైగా ఆర్డర్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంలు, ఇతర అవసరాలకు సంబంధించిన వస్త్రాల తయారీ ద్వారా కూడా స్థానిక నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
త్రిఫ్ట్ పథకం ద్వారా నేతన్నల పొదుపునకు ప్రభుత్వం సమానంగా చేయూతనిస్తోందని, నేతన్నల బీమా పథకం కింద సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 129 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయడంతో పాటు రూ.25 కోట్ల మేర రుణభారం తగ్గించామని తెలిపారు.
25 హెచ్‌పీ వరకు పవర్‌లూమ్‌లకు యూనిట్‌కు రూ.2 విద్యుత్ సబ్సిడీ అమలు చేయడంతో మూతపడిన అనేక పవర్‌లూమ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయని, దీంతో కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన చేనేత రంగ బకాయిల్లో రూ.350 కోట్లకు పైగా చెల్లించామని, 2025–26 చీరల బిల్లుల్లో 80 శాతం ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు.
చేనేతకు ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల జిల్లాలో నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతన్నలు, నేతన్నలు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చివరగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.




