Peddapalli: కాళేశ్వరం పేరిట 100 అబద్ధాలు చెప్పారు.. విప్ తీవ్ర విమర్శలు

Peddapalli: కాళేశ్వరం ప్రాజెక్టుపై BRS ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు విమర్శించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 25 July 2026 2:42 PM IST
Peddapalli
X

Peddapalli: కాళేశ్వరం పేరిట 100 అబద్ధాలు చెప్పారు.. విప్ తీవ్ర విమర్శలు

Peddapalli: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు 100 అబద్ధాలు చెప్పి మభ్యపెట్టిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో 75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ముందుగా కార్యాలయ ప్రారంభానికి వచ్చిన ప్రభుత్వ విప్ కు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇనుకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి జలసిరి కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూరం వెళ్లకుండా, మండల స్థాయిలోనే త్వరితగతిన ప్రభుత్వ సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే అర్జీదారుల (ప్రజల) సమస్యలను ఆలస్యం చేయకుండా, జవాబుదారీతనంతో పరిష్కరించాలని అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు.​ కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా పెద్దపల్లి నియోజకవర్గానికి నీళ్లు వస్తున్నాయని చెప్పడం ఒట్టి అబద్ధమని విజయ రమణారావు స్పష్టం చేశారు.

"కన్నెపల్లి నుంచి తొమ్మర్లగూడెం దాకా ఎలాంటి నీళ్లూ రావు. అసలు పెద్దపల్లి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు వచ్చే పాయింట్ ఏమైనా ఉందా?" అని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలో గానీ, నియోజకవర్గంలో ఒక గ్రామానికైనా నీళ్లు ఇచ్చినట్లు బిఆర్ఎస్ నాయకులు నిరూపించాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నంది మేడారం అని కట్టారే తప్ప ఏ నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.​

గతంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు 'తొలి నీళ్లే పెద్దపల్లిని ముద్దాడుతాయి' అని చెప్పారని, కానీ కరీంనగర్, జగిత్యాల, సూర్యాపేట వరకు అన్ని ప్రాంతాలను ముద్దాడుతాయని చెప్పి ఏ ఒక్క ప్రాంతానికీ నీళ్ళు అందించారు హరీష్ రావు చెప్పాలన్నారు. రైతుల బుర్రల్లో అబద్ధాలను నింపి మోసం చేయడమే లక్ష్యంగా గత పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు.​ ప్రస్తుతం తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితి ఉందని పరిస్థితికి అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయంగా కందులు, నువ్వులు వంటి పంటలు వేసేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా విజయ రమణారావు రైతు సోదరులకు సూచించారు.

సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను నివారించుకోవాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణరావు రైతులకు పిలుపునిచ్చారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఇటీవలే గవర్నర్, ముఖ్యమంత్రి తో అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించారు.

కొద్ది నెలల క్రితం శ్రీరాంపూర్‌లో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించామని, నేడు ఓదెల తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.గత రెండున్నర సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఓదెలలో కోర్టు మంజూరైందని, త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పారు.

జిల్లాలో డబుల్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, పోత్కపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. గత ఏడాది శ్రీరాంపూర్, ఓదెల మండలాల టెయిల్ ఎండ్ ప్రాంతాలకు కూడా సాగునీరు అందించగలిగామని చెప్పారు.గత సీజన్‌లో అధిక వర్షాలు కురిసిన సమయంలో రానున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి చెరువులను నింపాలని అధికారులకు సూచించామని, ఆ సమయంలో తీసుకున్న చర్యల వల్లే ప్రస్తుతం ఈ మండలాల్లో కొంత మేర నీరు అందుబాటులో ఉందన్నారు.

ఇటీవల కురిసిన వర్షాలను చూసి నీటి సమస్య ఉండదనే అపోహలో రైతులు ఉండవద్దని సూచించారు. ఒక ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగు ఎకరాల్లో కందులు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి పంటలను సాగు చేయవచ్చని వివరించారు.కందులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని, నాలుగు నెలల్లోనే పంట చేతికి వచ్చి క్వింటాల్‌కు సుమారు రూ.10 వేల వరకు ధర లభిస్తోందన్నారు. ఆగస్టు నెలలో నువ్వుల సాగు కూడా చేపట్టవచ్చని, వాటికి క్వింటాల్‌కు సుమారు రూ.9 వేల వరకు మార్కెట్ ధర లభిస్తోందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలనే సాగు చేయాలని, వారి సూచనలు పాటించకుండా అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేస్తే రానున్న రోజుల్లో నీటి కొరత కారణంగా పంటలను కాపాడుకోవడం రైతులకు చాలా కష్టమవుతుందని హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లాకు వంద ఎకరాలకు కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రతి రోజూ మంచి వర్షాలు కురవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని, ప్రతి రైతు పరిస్థితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా పంటల ఎంపిక చేసుకోవాలని కోరారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్లో మంచి ధరలు లభించే అవకాశముందని తెలిపారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ప్రతి ఎకరానికి రూ.6 వేల రైతు భరోసా అందిస్తున్నామని, ఇటీవల తొమ్మిది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వరి కొనుగోళ్లలో క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు.

పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. గత రెండేళ్లలో ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5.5 కోట్ల నిధులు వెచ్చించామని తెలిపారు. గతంలో పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల లలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయని అన్నారు.

జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. గతంలో నెలకు కేవలం 30 నుంచి 40 ప్రసవాలు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం నెలకు సుమారు 250 ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రూ.53 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి మరో రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధం కానుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story