Gangadhara: జగిత్యాల హైవే దిగ్బంధం.. తూకాల్లో అక్రమాలపై రైతుల ధర్నా!

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి స్టేజి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 7 May 2026 11:27 AM IST
Gangadhara
X

Gangadhara: జగిత్యాల హైవే దిగ్బంధం.. తూకాల్లో అక్రమాలపై రైతుల ధర్నా!

గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి స్టేజి సమీపంలో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో 20 రోజుల క్రితం పోసిన వరి ధాన్యాన్ని ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో పాటు తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, బస్తాకు 41 కిలోలు మాత్రమే ఉండాల్సిన వడ్లను 42.200 కిలోలు తూకం వేస్తున్నారని ఆరోపించారు.

అదేవిధంగా ఇప్పటివరకు కేవలం రెండు లారీల వడ్లను మాత్రమే రైస్ మిల్లులకు తరలించారని, అక్కడికి చేరుకున్న తర్వాత కూడా బస్తాకు కిలో చొప్పున సుమారు 700 కిలోల వరకు తరుగు తీశారని వాపోయారు. దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ ధర్నాతో కరీంనగర్–జగిత్యాల రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఎలాంటి కొర్రీలు లేకుండా వెంటనే వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న గంగాధర ఎస్సై వంశీకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పై అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story