Sircilla: వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది రాకపోకలు బంద్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట-లింగన్నపేట మధ్య తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ముస్తాబాద్-గంభీరావుపేట రాకపోకలు బంద్, ప్రయాణికుల తీవ్ర అవస్థలు.
Sircilla: వరద ఉధృతికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది రాకపోకలు బంద్!
Sircilla: ఏళ్లు గడుస్తున్నా రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో లింగన్నపేట–గంభీరావుపేట మధ్య ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
దీంతో ముస్తాబాద్–గంభీరావుపేట మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుండటంతో గ్రామీణులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఏటా ఇదే పరిస్థితి వర్షాకాలంలో వరదలు వచ్చిన ప్రతిసారీ తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేయడం, వరద ఉధృతికి అది కొట్టుకుపోవడం పునరావృతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా శాశ్వత వంతెన నిర్మాణం మాత్రం పూర్తికాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏటా తాత్కాలిక రోడ్ల కోసం ఖర్చు చేయడం కంటే శాశ్వత వంతెన నిర్మిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.




