Karimnagar: ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. పలు హోటళ్ల లైసెన్సులు రద్దు!

Karimnagar: ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పాలు లేకుండా మైదాతో స్వీట్ల తయారీని గుర్తించి శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి, హోటళ్ల లైసెన్సులను రద్దు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 10 Sept 2026 10:46 PM IST
Karimnagar
X

Karimnagar: ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. పలు హోటళ్ల లైసెన్సులు రద్దు!

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ మరియు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ఆహార వ్యాపార సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడినవి. జిల్లాలోని పలు హోటల్లో తనిఖీలు నిర్వహించి గుర్తించి హోటళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లను రద్దు చేశారు.

తనిఖీ చేసిన హోటళ్ల వివరాలు..

శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి, బౌపేట్, కరీంనగర్ ఈ ఆహార తయారీ సంస్థలో తయారయ్యే స్వీట్లు కరీంనగర్, సిరిసిల్ల మరియు పెద్దపల్లి జిల్లాల్లోని పలు స్వీట్ షాపులు మరియు బేకరీలకు సరఫరా చేయబడుతున్నాయి.

తనిఖీల సందర్భంగా సంస్థలో తీవ్ర ఆహార భద్రతా మరియు పరిశుభ్రత లోపాలు గుర్తించబడ్డాయి. తయారీ ప్రాంగణం అత్యంత అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, పరిశుభ్రత ప్రమాణాలు పాటించబడటం లేదని గుర్తించారు.

తనిఖీలో అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా, పాలతో తయారు చేయాల్సిన స్వీట్లను పాలు ఉపయోగించకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అజ్మేరి కలాకండ్ను పాలకు బదులుగా మైదాతో తయారు చేస్తుండగా, మిల్క్ మైసూర్ పాక్ను కూడా పాలు ఉపయోగించకుండా అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

సుమారు 40 కిలోల కల్తీ స్వీట్లు (అజ్మేరి కలాకండ్ మరియు మిల్క్ మైసూర్ పాక్)ను సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేశారు. అదేవిధంగా, ఈ ఉత్పత్తుల తయారీని నిరోధించేందుకు సుమారు 1,300 కిలోల ముడి పదార్థాలు (మైదా, చక్కెర తదితరాలు)ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించే ఈ ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకొని, ఆహార వ్యాపార సంస్థను వెంటనే మూసివేసి, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం సంస్థ యొక్క FSSAI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను సస్పెండ్ చేయుటకు చర్యలు ప్రారంభించబడినవి.

కూచిపూడి రెస్టారెంట్, కరీంనగర్ తనిఖీలో వంటశాల అపరిశుభ్రంగా ఉండటం, ఆహార నిర్వాహకులు వ్యక్తిగత పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం గుర్తించబడింది.

అదనంగా, బట్టర్ నాన్ తయారీలో ఫ్యాట్ స్ప్రెడ్ వినియోగిస్తున్నట్లు గుర్తించగా, సంబంధిత ఆహార ప్రమాణాలు మరియు లేబులింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించేందుకు పరిశీలన చేపట్టబడింది.

గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశిస్తూ సంబంధిత ఆహార వ్యాపారికి ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ జారీ చేయబడింది.

ఫేమస్ హోటల్, గీతాభవన్ చౌరస్తా, కరీంనగర్ ఈ హోటల్ ఎటువంటి FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించబడింది. దీంతో హోటల్‌ను వెంటనే మూసివేయడం జరిగింది. అవసరమైన FSSAI లైసెన్స్ పొందిన అనంతరం మాత్రమే తిరిగి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వబడుతుంది.

మతామ్ అల్ హబీబి అరేబియన్ ఫ్యామిలీ రెస్టారెంట్, గీతాభవన్ చౌరస్తా సమీపంలో, కరీంనగర్ ఈ రెస్టారెంట్‌లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి. గతంలోనే ఆహార తయారీలో కృత్రిమ రంగులు ఉపయోగించవద్దని స్పష్టంగా సూచించినప్పటికీ, నిబంధనలను పాటించలేదు.

వంటశాలలో బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 8 కిలోల హాండీ రైస్ను సంఘటనా స్థలంలోనే పారవేయించారు. తీవ్రమైన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకొని, ఆ సంస్థ యొక్క FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా, సంబంధిత ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, విశ్లేషణ నిమిత్తం రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించబడినవి.

ఆహార భద్రత శాఖ ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారం అందించేందుకు ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తుందని తెలియజేస్తోంది.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story