Sircilla: సిరిసిల్లలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు చర్యలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
Sircilla: సిరిసిల్లలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు చర్యలు!
Sircilla: దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రి-యునిక్ కంపెనీ, డ్రిప్ కంపెనీల ప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో వరి సాగు నుంచి ఆయిల్ పామ్ వైపు రైతులను మళ్లించేలా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, సాగు పురోగతి, నిర్దేశిత లక్ష్యాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా రైతులు ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
వరి సాగుతో ఎదురవుతున్న ఇబ్బందులు, ఆయిల్ పామ్ సాగుతో లభించే దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను రైతులకు వివరించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై కూడా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల అనుభవాలను ఇతర రైతులకు తెలియజేసి, ఆసక్తి ఉన్న వారిని సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు నిర్దేశించిన ఆయిల్ పామ్ మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించేలా వారపు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులను సంప్రదించి, ఆసక్తి ఉన్న వారిని గుర్తించి అవసరమైన సహకారం అందించాలన్నారు.
రైతులకు సాంకేతిక సహకారం, మొక్కల సరఫరా, డ్రిప్ ఏర్పాటులో ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యానవన, వ్యవసాయ శాఖలు, సంబంధిత కంపెనీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి ఆర్. శరత్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




