Sircilla: 1,700 ఎకరాల్లో ఆయిల్‌పామ్, కూరగాయలు, పూల సాగు!
Sircilla: సిరిసిల్ల జిల్లాలో 1,700 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు జరుగుతోందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
Sircilla: 1,700 ఎకరాల్లో ఆయిల్‌పామ్, కూరగాయలు, పూల సాగు!
సిరిసిల్ల: సంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన పంటల వైపు రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్‌పామ్‌తో పాటు కూరగాయలు, పూల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టితో చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పరిశీలనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 420 ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1,250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, క్షేత్రస్థాయిలో ఉద్యానవన, వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రత్యామ్నాయ పంటల ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఫలితంగా ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో వరి సాగు నుంచి ఆయిల్‌పామ్ సాగుకు మారారు.
ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం
25 నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయం అందించే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మొదటి మూడు సంవత్సరాల్లో ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలు సాగు చేసుకుంటూ అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయిల్‌పామ్‌కు టన్నుకు రూ.23 వేలకుపైగా ధర ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎల్‌నినో ప్రభావం, సాగునీటి ఇబ్బందులను అధిగమిస్తూ ప్రత్యామ్నాయ పంటల ద్వారా ఆదాయం పొందేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు.
రెండు ఎకరాల్లో బంతి పూల సాగు
గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రైతు బోయిని మల్లేశం తనకున్న మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాల్లో బంతి పూల సాగు చేపట్టారు. జూలైలో నాటిన ఈ పంట 60 నుంచి 65 రోజుల్లో కోతకు వస్తుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పూల దిగుబడి పొందే అవకాశం ఉంది. ప్రతి రెండు మూడు రోజులకోసారి పూలను కోసుకోవచ్చు.
ఎకరానికి సుమారు 45 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా, రెండు ఎకరాల సాగుకు మల్లేశం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. ఉద్యానవన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు 50 శాతం రాయితీ లేదా ఎకరానికి రూ.8 వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు సబ్సిడీ అందుతుంది. ప్రస్తుతం కిలో బంతి పూలకు సగటున రూ.60 వరకు ధర లభిస్తుండగా, దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజల సమయంలో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
రైతును అభినందించిన కలెక్టర్
గజసింగవరంలో బోయిని మల్లేశం సాగు చేస్తున్న బంతి పూల తోటను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. పంట సాగు విస్తీర్ణం, పెట్టుబడి, దిగుబడి, పంట చేతికి వచ్చే సమయం, ఆదాయం తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లేశంను శాలువాతో సన్మానించి అభినందించారు.
వరి సాగుకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇతర రైతులు కూడా ఆదర్శ రైతులను స్ఫూర్తిగా తీసుకొని తమ భూముల్లో ఆరుతడి పంటలు, కూరగాయలు, పూల సాగు చేపట్టి అధిక ఆదాయం పొందాలని సూచించారు. ఉద్యానవన, వ్యవసాయ తదితర శాఖల ద్వారా అందుతున్న ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను కలుసుకొని సాగు విధానాలు, దిగుబడి, ఆదాయం, లాభాలపై వివరాలు తెలుసుకుంటూ వారిని అభినందిస్తున్నారు.
కలెక్టర్ పర్యటనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.




