Sircilla: ఎల్ నినోపై అప్రమత్తత.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు పిలుపు
Sircilla: ఎల్ నినోపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి, ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ టెలీ కాన్ఫరెన్స్ సమీక్ష.
Sircilla: ఎల్ నినోపై అప్రమత్తత.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు పిలుపు
సిరిసిల్ల: ఎల్ నినో ప్రభావంపై ప్రజలు, ముఖ్యంగా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ శాఖ అధికారులు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
జిల్లాలోని అన్ని మండలాల సాగు విస్తీర్ణం, ప్రస్తుతం సాగులో ఉన్న పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్ పామ్, పండ్ల తోటల సాగును ప్రోత్సహిస్తూ, అవసరమైన విత్తనాలు, మొక్కలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వసతి గృహాల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని భవనాలు, ఇళ్లలో కూడా ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, కొత్త భవనాలకు ఇంకుడు గుంతలు ఉంటేనే అనుమతులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు బోర్‌వెల్ల రీచార్జ్ పనులు, పామ్ పాండ్లు, పర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, మొదటి దశలో మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, నిర్మాణ సామగ్రిపై పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటి నిర్మాణ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి జయశీలతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




