Sircilla: సిరిసిల్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో రహదారి భద్రతపై అవగాహన సదస్సు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Sircilla: సిరిసిల్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో రహదారి భద్రతపై అవగాహన సదస్సు!
సిరిసిల్ల: జిల్లా కలెక్టర్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల విద్యానగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి (DTO) దేవునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, రహదారిని దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్‌ను వినియోగించి ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించాలని విద్యార్థులకు వివరించారు.
అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించకూడదని సూచించారు. విద్యార్థులు తాము మాత్రమే కాకుండా తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రవాణా శాఖ సిబ్బంది, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ, ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు రహదారి భద్రతకు సంబంధించిన పలు సూచనలు, జాగ్రత్తలను వివరించారు.




