Sircilla: సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: క్లినికల్ తనిఖీల్లో డీఎంహెచ్ఓ!
Sircilla: డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రుల్లో వైద్య సేవలు, వసతులను తనిఖీ చేశారు.
Sircilla: సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: క్లినికల్ తనిఖీల్లో డీఎంహెచ్ఓ!
రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, మౌలిక వసతులు, పారిశుద్ధ్య పరిస్థితులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ పరిశీలించారు. గంభీరావుపేట పీహెచ్‌సీ పరిధిలోని NQAS గుర్తింపు పొందిన బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌తో పాటు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ప్రైవేట్ ఆసుపత్రిని ఆమె సందర్శించారు.
బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, మందుల లభ్యత, ల్యాబొరేటరీ పరీక్షలు, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితులను డీఎంహెచ్ఓ పరిశీలించారు. NQAS ప్రమాణాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
అనంతరం అశ్విని ప్రైవేట్ ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ.. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. రోగులకు నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించాలని, అవసరం లేని వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయకుండా వైద్య నైతిక విలువలను పాటించాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రిలోని ఓపీ, ఐపీ విభాగాలు, ప్రసూతి వార్డు, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, ల్యాబొరేటరీ, ఫార్మసీ, అత్యవసర వైద్య సేవలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగుల రికార్డులు, పారిశుద్ధ్యం, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ చర్యలు, మందులు, వైద్య పరికరాల లభ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు.
సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, గర్భిణులు, నవజాత శిశువులకు ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందించాలని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నాగేంద్రబాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, పీహెచ్‌సీ వైద్యాధికారి సరియ అంజుమ్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




