Siricilla: గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రత: డీజీపీ సీవీ ఆనంద్

Siricilla: గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశం. మండపాల వద్ద సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ తప్పనిసరి, డీజేలపై ఆంక్షలు.

KALEEM, SIRICILLA
Published on: 7 Sept 2026 8:01 PM IST
Siricilla
X

Siricilla: గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రత: డీజీపీ సీవీ ఆనంద్

సిరిసిల్ల: ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సీ.వీ. ఆనంద్ ఐపీఎస్ అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, పోలీస్ అధికారులను ఆదేశించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గణేష్ మండపాలు, విగ్రహాల ఏర్పాటు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, మండపాల వివరాలు, ఊరేగింపు మార్గాలు, తేదీలు, సమయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. గతంలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, సున్నితమైన, వివాదాస్పద ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గణేష్ విగ్రహాల విక్రయ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, విగ్రహాల ఆగమనం, శోభాయాత్ర, నిమజ్జనం సమయంలో డీజేలు, బాణసంచా వినియోగంపై నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఉత్సవ నిర్వాహకులు, పీస్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భద్రతా నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి మండపం వద్ద కనీసం ముగ్గురు వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు.

సున్నిత ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించాలని, సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ఊరేగింపు మార్గాలను ముందుగానే పరిశీలించి రోడ్లపై గుంతలు, చెట్లు, విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల వంటి సమస్యలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయంతో పరిష్కరించాలన్నారు.

నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన స్విమ్మర్లు, క్రేన్లు, లైటింగ్, సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై స్టేషన్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమాచారంపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

మండపాల వద్ద విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని ముందుగానే నియమించి, వారి విధులు, బాధ్యతలపై ప్రత్యేకంగా బ్రీఫింగ్ ఇవ్వాలని డీజీపీ సూచించారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐ మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, రమేష్‌తో పాటు ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story