Karimnagar: హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!

Karimnagar: కరీంనగర్‌లో జరిగిన సీపీఎం జిల్లా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నేతలు ధ్వజమెత్తారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 7:01 PM IST
Karimnagar
X

Karimnagar: హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం!

కరీంనగర్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే, ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం ముకుందలాల్ మిశ్రాభవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ప్రజా అనుకూల చట్టాలు చేయకపోగా, ప్రజానీకానికి వ్యతిరేకమైన చట్టాలు తెచ్చిందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి విబిజి రాంజీ పేరుతో కొత్త చట్టం తెచ్చారని ఇది పూర్తిగా ఉపాధి కూలీల కడుపు కొట్టే చట్టమన్నారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తే కొత్త చట్టం లో కేవలం 60 శాతం నిధులు మాత్రమే ఇస్తామని పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు.

పని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా, పనిముట్లు ఇవ్వకుండా, రోజువారి పని కల్పించకుండా, చేసిన పనికి వారాల తరబడి బిల్లులు పెండింగ్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే చట్టాలు..

ఉపాధి హామీ పని దినాలు పెంచి, రోజువారి కూలి పెంచాలని డిమాండ్ చేశారు. విత్తన చట్టం, విద్యుత్తు సంస్కరణ చట్టాలు రైతాంగానికి వ్యతిరేకమైనవని, కార్పొరేట్లకు, బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, ఆత్మహత్యలు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడిన రైతాంగ ఉద్యమానికి లిఖితపూర్వక అనేక హామీలు ఇచ్చినప్పటికీ నేటికీ నెరవేర్చలేదు అన్నారు.

కార్మికులను బానిసలు చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాలు..

భూమి నుండి రైతును దూరం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేసిందన్నారు. స్వాతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోళ్లను తెచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గాన్ని మరింత శ్రమ దోపిడీ చేసేందుకు, మరింత కట్టు బానిసలుగా చేసేందుకే తీసుకొచ్చారన్నారు. కార్మిక వర్గం కష్టజీవులు ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాలన్నారు.

ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదు..

దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. యువత నిర్వీర్యం అయితే దేశ ప్రగతికే నష్టదాయకమన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదన్నారు. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా స్వచ్ఛ రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం విడాలన్నారు. బిజెపి ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభలను నివారించడంలో దారుణంగా విఫలమైందన్నారు. ఇరాన్ పై సామ్రాజవాద అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల పట్ల మౌనం వహిస్తూ బీజేపీ రాజ్యాంగ విలువలను కాల రాస్తున్నదన్నారు. వలసవాద సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకిస్తున్నామని ధైర్యంగా చెప్పలేని మోడీ ప్రభుత్వం,దేశ సార్వభౌమత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం..

దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోతున్నపట్టికి పట్టించుకోకుండా, ఆర్థిక అస్థిరత్వం పై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో పెరిగి పోతున్న నిరుద్యోగం, దారిద్రం, పేదరికం గురించి పట్టించుకోకుండా దేశభక్తి పేరుతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారన్నారు.

కేరళ తరహాలో ఉచిత విద్యను అందించండి..

సిపిఎంరాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. రమ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేరళకు వెళ్లి రేవంత్ రెడ్డి నాటకాలు ఆడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరన్నారు. వ్యవసాయ కూలీలకు,12,000 కౌలు రైతులకు 15000,మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మి తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీలు, నిరుద్యోగ భృతి వంటి ఏ ఒక్క హామీని అమలు చేయని అసమర్ధ సీఎం, దేశానికి ఆదర్శంగా నిలిచిన కేరళ రాష్ట్రాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. హామీల అమలు చేయడం చేతకాక అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజా ఉద్యమాల ద్వారా తగిన బుద్ధి చెబుతామన్నారు. కేరళ తరహాలో మొత్తం ప్రజానీకానికి ఉచిత విద్య అందించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేస్తూ, వాటి పరిష్కారం కొరకు ఐక్య ఉద్యమ పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈసమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గిట్ల ముకుందరెడ్డి, గుడి కందుల సత్యం, జి బీమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునుటి శ్రీనివాస్, సుంకరి సంపత్, వెలమారెడ్డి రాజిరెడ్డి, ఎడ్ల రమేష్, డి నరేష్, కొప్పుల శంకర్,జిల్లా నాయకులు వడ్ల రాజు, తిప్పారపు సురేష్, జి శ్రీకాంత్, బాసిర సంపత్ రావు, రాయి కంటి శ్రీనివాస్, మాతంగి శంకర్, అరుణ, ఎం.శ్రీలత నాయకులు దుర్గాప్రసాద్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, రాములు,పుట్ట లక్ష్మణ్, వి కిషోర్, డి సతీష్, శ్రీనివాస్,మోహన్ నాయక్, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story