Karimnagar: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీపీఎం!
Karimnagar: గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీపీఎం నేత మిల్కూరి వాసుదేవరెడ్డి కరీంనగర్ కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేశారు.
Karimnagar: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీపీఎం!
కరీంనగర్: జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్లె సీమల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజలకు అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని తెలిపారు. పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్మికులు అందర్నీ రెండవ పిఆర్సి లో గుర్తించి కనీస వేతనం నెలకు 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దుచేసి కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికులందరికీ ప్రతి నెల ఒకటో తారీకు అకౌంట్లో వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు.
వయసు పైబడి, అనారోగ్యం పాలైన మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేసి పర్మినెంట్ చేయాలన్నారు. గ్రామాల్లో కొందరు సర్పంచులు తమ ఇష్టం వచ్చినట్లు కార్మికులను తొలగిస్తున్నారని ప్రభుత్వం స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. మరణించిన కార్మికుల దాన సంస్కారాలకు కనీసం తక్షణ సహాయం 30 వేలు అందించాలన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల్లో నూటికి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారే పని చేస్తున్నారని, వీరి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం శోచనీయమన్నారు. రాష్ట్ర సర్కార్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు.




