Siricilla: భూముల రీసర్వే కచ్చితత్వంతో చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే, భూభారతి ప్రక్రియలను కచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 31 Aug 2026 7:33 PM IST
Siricilla
X

Siricilla: భూముల రీసర్వే కచ్చితత్వంతో చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

సిరిసిల్ల: జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో కచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భూముల రీ సర్వే, భూ భారతి, సాదాబైనామా, ఎస్‌ఐఆర్, 22ఏ తదితర అంశాలపై మండలాల వారీగా పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో భూముల వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో సర్వే ప్రారంభించే ముందు ఆయా భూముల సర్వే నంబర్ల వివరాలపై ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని తెలిపారు.

గ్రామ సరిహద్దుల రీ సర్వే, ఇతర సంబంధిత పనులను తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామ సరిహద్దుల రీ సర్వే సమయంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి తహసీల్దార్ భూముల రీ సర్వే, భూ భారతి, సాదాబైనామా, ఎస్‌ఐఆర్ తదితర ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భూముల వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story