Mustabad: ఆయిల్ పామ్‌తో రైతుకు రూ.3.45 లక్షల లాభం: కలెక్టర్ ప్రశంసలు!

Mustabad: ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో ఆయిల్ పామ్ సాగుతో రూ.3.45 లక్షల ఆదాయం సాధించిన రైతు చంద్రశేఖర్‌ను రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు.

KALEEM, SIRICILLA
Published on: 8 Sept 2026 4:03 PM IST
Mustabad
X

Mustabad: ఆయిల్ పామ్‌తో రైతుకు రూ.3.45 లక్షల లాభం: కలెక్టర్ ప్రశంసలు!

ముస్తాబాద్: ఏడు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసిన నామాపూర్ రైతు అరవెల్లి చంద్రశేఖర్ రావు నాలుగేళ్ల తర్వాత 15 టన్నుల దిగుబడి సాధించి రూ.3.45 లక్షల ఆదాయం పొందారు. ప్రస్తుతం మరో రెండు ఎకరాల్లో మామిడి, నిమ్మ తోటలను సాగు చేస్తున్నారు.

రైతు వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఆయిల్ పామ్ సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సస్యరక్షణ చర్యలు, పెట్టుబడి, దిగుబడి, ఆదాయం తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. మంచి దిగుబడి సాధించినందుకు రైతును అభినందించారు.

రైతులు దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి మూడు సంవత్సరాల్లో ఉద్యానవన శాఖ సూచనల మేరకు కూరగాయలు, పూలు, పండ్లను అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ప్రస్తుతం ఆయిల్ పామ్ టన్ను ధర రూ.24,025గా ఉందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో నామాపూర్, బోయినపల్లి, నేరెళ్ల, సిరిసిల్లలో కలెక్షన్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అక్కడ సేకరించిన ఆయిల్ పామ్ ఉత్పత్తులను సిద్ధిపేట జిల్లా నర్మెట్టలోని ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు చెప్పారు.

మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వస్తే జిల్లాలో అదనపు కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఏడీఏ ప్రదీప్, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీఓ లచ్చాలు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story