Sircilla: ఉధృత వర్షాలు.. క్షేత్రస్థాయి అధికారులను హై అలర్ట్ చేసిన కలెక్టర్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sircilla: ఉధృత వర్షాలు.. క్షేత్రస్థాయి అధికారులను హై అలర్ట్ చేసిన కలెక్టర్
సిరిసిల్ల: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్&బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, శిథిలావస్థలో ఉన్న భవనాలు, లో లెవెల్ కల్వర్టులు, వాగులు, వంతెనలు, రహదారులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వర్షాల కారణంగా ఎక్కడైనా ఆస్తి, ప్రాణ లేదా పంట నష్టం సంభవిస్తే వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించి పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
సీజనల్ వ్యాధుల నివారణకు డ్రైడే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, దోమల నివారణతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు.వర్షపు నీటి సంరక్షణకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించాలని, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించేందుకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అవసరమైతే 9398684240 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.




