Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్ ముందు మున్సిపల్ కార్మికుల ధర్నా

Sircilla: ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 22 Jun 2026 2:44 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్ ముందు మున్సిపల్ కార్మికుల ధర్నా

Sircilla: ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ... ఎండనక, వాననక, చలినక ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు.

కార్మికులకు 2009 నుంచి 2012 వరకు సంబంధించిన పీఎఫ్ బకాయిలు ఇప్పటికీ అందలేదని, ఈఎస్ఐ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, రక్షణ పరికరాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అధికారులు సైతం అమలు చేయడం లేదని ఆరోపించారు.

అనంతరం తమ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన కార్మికులు, ప్రభుత్వం వెంటనే స్పందించి హామీలను అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story