Sircilla: తంగళ్లపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి!

Sircilla: వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు నిజమైన నివాళి అని సీపీఎం రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కోడం రమణ అన్నారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Sept 2026 6:42 PM IST
Sircilla
X

Sircilla: తంగళ్లపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి!

Sircilla: చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు ఇచ్చే అసలైన నివాళి అని సీపీఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా తంగళ్లపల్లి మండల సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కోడం రమణ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులిమి బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని విద్రోహ, విమోచన దినంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజాం ప్రభుత్వ కాలంలో హిందూ భూస్వామ్య దొరలకు వ్యతిరేకంగా సాగిన పోరాటం వర్గ పోరాటమని పేర్కొన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మతపరమైన పోరాటమైతే షేక్ బందగీ, షోయబుల్లాఖాన్, మఖ్దూం మొహియుద్దీన్ వంటి వారు ఆ పోరాటంలో పాల్గొని ఎలా అమరులయ్యారని ప్రశ్నించారు. తెలంగాణకు పటేల్ సైన్యాలు వచ్చి విమోచన కల్పిస్తే.. నిజాం రాజు కాసిం రజ్వీని రాజ్ ప్రముఖ్‌గా ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వాస్తవాలను ప్రజలు గమనించాలని కోరారు.

సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కోడం రమణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు బూర శ్రీనివాస్, గోవిందు లక్ష్మణ్, మూశం శంకర్, మరికంటి నరసయ్య, గంగాధర్, వేణు, నరేందర్, పెంటయ్య, రమేష్, హరిదాస్, రజిత తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story