Karimnagar: కరీంనగర్లో 35% ముగిసిన జన గణన.. జూన్ 9 లోపు పూర్తికి ఆదేశం!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మొదటి దశ జన గణన (హౌజ్ లిస్టింగ్) ప్రక్రియపై సెన్సెస్ చార్జ్ ఆఫీసర్ బషిరొద్దిన్ సమీక్ష నిర్వహించారు.
Karimnagar: కరీంనగర్లో 35% ముగిసిన జన గణన.. జూన్ 9 లోపు పూర్తికి ఆదేశం!
కరీంనగర్: భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జన గణన కీలకమని ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని సెన్సెస్ చార్జ్ ఆఫీసర్ బషిరొద్దిన్ సూపర్ వైజర్లు ను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందింలో జన గణన " సూపర్ వైజర్లతో సమీక్షా సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న మొదటి దశ (హౌజ్ లిస్టింగ్) జన గణన ప్రక్రియ విధానం, క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు వివరాల సేకరిస్తున్న తీరు తదితర విషయాలను సూపర్ వైజర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జన గణన పై పలు సూచనలు చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని హౌజ్ లిస్టు బ్లాక్ ల వారిగా ప్రతి ఇంటినీ సర్వే చేయాలని మొదటి దశ గణనలో హౌజ్ నంబరింగ్, నివాస గృహాల వివరాల సేకరణ అత్యంత కీలకమని సూచించారు. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌ల పరిధిలో ప్రతి ఇంటినీ సందర్శించి, ఖచ్చితమైన వివరాలను సేకరించేలా సూపర్ వైజర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడా ఏ ఒక్క ఇల్లు తప్పిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్యూమరేటర్లకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక లేదా ఇతర సమస్యలను సూపర్ వైజర్లు తక్షణమే పరిష్కరిస్తూ, ప్రక్రియ వేగవంతంగా సాగేలా చూడాలన్నారు. ప్రజల జీవన స్థితిగతులు, గృహాల వసతుల సమాచారాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం పక్కాగా నమోదు చేసేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు దాదాపు 35% జన గణన ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. జూన్ 9 లోపు పూర్తి చేసేలా సూపర్ వైజర్లు చర్యలు తీసుకోవాలని... సంబంధిత అంశాన్ని ఎన్యూమరేటర్లకు సూచించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గణాంకాలే ప్రాతిపదిక అని, అందువల్ల నగర ప్రజలందరూ తమ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు సహాకరించి ఖచ్చితమైన వివరాలు అందించి విజయవంతం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సెన్సస్ ఆఫీసర్ ఖాధర్ మొహియుద్దీన్, అదనపు చార్జ్ ఆఫీసర్లు వేణు, శ్రీధర్, జన గణన మాస్టర్ ట్రైనర్లు, సూపర్ వైజర్లు, పాల్గొన్నారు.




