Sircilla: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి: బీజేపీ

Sircilla: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిరిసిల్ల పాత బస్టాండ్‌లో పటేల్ విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ నేత గోపి డిమాండ్ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Sept 2026 3:40 PM IST
Sircilla
X

Sircilla: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి: బీజేపీ

సిరిసిల్ల: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని శుద్ధి చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరచిపోరన్నారు.

తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలో వెనుకడుగు వేస్తున్నాయని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా విలీన దినోత్సవంగా పరిమితం చేసిందని ఆరోపించారు.

బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయుల త్యాగాలను భావితరాలకు చాటిచెబుతామని గోపి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, లింగంపల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బర్కం లక్ష్మి, శీలం రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గొప్పడి సురేందర్ రావు, జిల్లా అధికార ప్రతినిధులు నవీన్ యాదవ్, రాజాసింగ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి, పల్లె గ్రామ సర్పంచ్ రాగుల రాజు రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు సయ్యద్ సాబీర్, ధార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామ్ ప్రసాద్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండ నరేష్, ఉరవకొండ రాజు, మెరుగు శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ వంగల శ్రీకాంత్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA